జులై 1 నుంచి 'వీబీ జీ రామ్ జీ' చట్టం: కేంద్రం

  • గ్రామీణ కుటుంబాలకు 125 రోజుల చట్టబద్దమైన వేతన ఉపాధికి హామీ
  • కొత్త విధానానికి మారే క్రమంలో కార్మికులకు అంతరాయం కలగకుండా చర్యలు
  • కొత్త కార్డులు జారీ అయ్యే వరకు ఎంజీనరేగా కార్డులు చెల్లుబాటు
జీవనోపాది భద్రత, గ్రామీణ ప్రజల ఆదాయ కల్పన కోసం 'వీబీ జీ రామ్ జీ' చట్టాన్ని జులై 1వ తేదీ నుంచి అమలు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంను రద్దు చేసి దాని స్థానంలో కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ గ్యారంటీ పర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్-గ్రామీణ్ (వీబీ-జీ-రామ్-జీ)ను తీసుకువచ్చింది. ఈ కొత్త చట్టాన్ని జులై నుంచి అమలు చేయనున్నట్లు వెల్లడించింది.

దీని ద్వారా గ్రామీణ కుటుంబాలకు 125 రోజుల చట్టబద్దమైన వేతన ఉపాధికి హామీ లభిస్తుందని తెలిపింది. జీవనోపాధి భద్రత, గ్రామీణ ప్రజలకు ఆదాయ కల్పన, మౌలిక సదుపాయాల అభివృద్ధి, గ్రామీణ ప్రజల్లో పరివర్తనను తీసుకురావడమే ఈ చట్టం లక్ష్యమని గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ తెలిపింది. కొత్త విధానానికి మారే క్రమంలో కార్మికులకు ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది.

కొత్త గ్రామీణ రోజ్‌గార్ గ్యారెంటీ కార్డులు జారీ అయ్యే వరకు ప్రస్తుతం ఉన్న ఈ-కేవైసీ ఎంజీనరేగా కార్డులు చెల్లుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది. జాబ్ కార్డులు లేని కార్మికులు గ్రామ పంచాయతీలో నమోదు చేసుకోవాలని సూచించింది. వేతన చెల్లింపులు, ఫిర్యాదుల పరిష్కారం, పని కేటాయింపు నిబంధనలు, పరిపాలనా వ్యయం వంటి ఇతర అంశాల గురించి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు గ్రామీణాభివృద్ధి శాఖ తెలిపింది.

VB G Ramji
Vikshit Bharat Guarantee
Rural Employment
MGNREGA
NREGA
Rural Development

More Telugu News